డా॥ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారి గురించి
చిరుపరిచయం

రచయిత: ఆచార్య K.V. కృష్ణమూర్తి,
Founder Chairman & Managing Trustee, I-SERVE (Institute of Scientific Research on Vedas)
A Scientific Research organisation, recognised as a SIRO by Department of Scientific and Industrial Research (DSIR) మరియు
విద్యాధికారి, అవధూత దత్తపీఠం, మైసూరు


ఆధునిక విద్యార్హతలు, పదవులు, అధికంగా లేకపోయినా, భారతీయ శాస్త్రాలను, విద్యలను, గుండెలను చీల్చుకొని ప్రవహించే అభిమానంతో అధ్యయనం చేసిన, చేస్తున్న మహాత్ములు ఈ దేశంలో ఎందరో వున్నారు.

వారంతా మహనీయులే, నిత్యవందనీయులే. కానీ, వీరి లో ఈ దేశం కోసం, ఈ జాతికోసం, ఈ చరిత్ర కోసం, ఈ ధర్మం కోసం, తపించే వారి సంఖ్య వేళ్ళమీద లెక్కించదగినదిగానే వుంటుంది. అటువంటి అరుదైన పండితులలో అగ్రశ్రేణికి చెందినవారు డా. చిరావూరి శివరామకృష్ణశర్మగారు.

ఈ దేశంలో పండితులుగా అత్యధిక సన్మానాలు అందుకొంటున్నవారిలో, తాము గురువుల దగ్గర పాఠం చెప్పుకొన్న గ్రంథాలు గాక, మరో గ్రంథం ముట్టుకొనేవారు అధికంగా లేకపోవటం ఈ జాతికి పట్టిన దౌర్భాగ్యాలలో ఒకటి! అలాంటి సన్నివేశంలో, ఒక సాధారణ మధ్యతరగతి పండిత కుటుంబంలో జన్మించి, ఒక కళాశాలలో ఉపాధ్యాయుడుగా జీవితం గడపిన ఒక సామాన్య పండితుడు, సాంప్రదాయికంగా తాను గురువుల వద్ద అధ్యయనం చేసిన షట్ శాస్త్రాలకు మించి, నాలుగు వేదాల భాష్యాలను, 18 పురాణాలను, సంస్కృతాంధ్ర వ్యాకరణాలను, సాహిత్య – తద్విమర్శలను, ఇలా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో విషయాలను పరీక్షల కోసం గాక, ప్రాణతృప్తి కోసం అధ్యయనం చేశాడంటే, నమ్మ గలమా? కష్టమే. కానీ నమ్మాలి. ఎందుకంటే, ఎండిన దర్భపుల్లలాగా వున్న ఈ వ్యక్తి, ఈ శివరామకృష్ణ శర్మగారు మన ఎదురుకుండా, మనలో ఒకడుగా, మనలను మించిన మహనీయుడుగా, ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు!!!

ఈయన గూడా పొట్టకూటి కోసం మనందరిలాగానే M.A.లు, Ph.D. లు కొన్ని చేశాడు. ఆ కోర్సులు చదివేటప్పుడు, మనందరి లాగానే, ఈయన గూడా, ఆ పాఠ్య గ్రంథాలలోని అప్రాచ్యపు సిద్ధాంతాలను, చరిత్ర వక్రీకరణలను, కొండొకచో దేహద్రోహకర ప్రతిపాదనలను – చదివి వున్నాడు. సాంప్రదాయిక విద్వాంసులందరికీ అవి అభూత కల్పనలని తెలుసు. కానీ ఆ మాట నిరూపించటం ఎలా? ఇది ఎవరికి పట్టింది? మనకు డిగ్రీలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, మన ఉపన్యాసాలు, మన శాలువాలు, మనకున్నాయి – అన్న ఈ సర్వసాధారణ ధోరణికి వ్యతిరేకంగా, ఏటికి ఎదరొడ్డి నిలబడ్డవాడు మన ఆంధ్రదేశంలో పూర్వం కోట వెంకటాచలంగారు వుండేవాడు; ఇప్పుడు ఈ శివరామకృష్ణశర్మ గారు మినుకు మినుకుమంటున్నాడు!

అందుకే, ఇతరుల ప్రోత్సాహంతో పనిలేకుండా ఒక విశ్వవిద్యాలయ పరిశోధన శాఖ చేయగలంత పనిని, ఈయన తన 40 సంవత్సరాల పరిశోధన జీవితంలో చేసి చూపించాడు. చూపిస్తే చూసేవాడేడి? గ్రంథాలు ముద్రిస్తే చదివేవాడేడి? ప్రభుత్వ పరిశోధన సంస్థలకు ఆ ప్రతులను పంపిస్తే, పట్టించుకొన్న వాడేడి? మన దేశ పరిపాలకుల మైండ్సెట్టులో మరలు కదలిన గదా!

అందుకే Dr. శివరామకృష్ణశర్మ గారు, ఈ దేశానికి సమర్థుడైన నాయకుడు రావాలని, గత 15 సంవత్సరాలుగా, ప్రతి యేడూ లక్షల రూపాయలు కర్చు పెట్టి, నిగూఢంగా తన యింటిలోనే యాగాలు, వ్రతాలు, జపాలు వంటివి, తన కుటుంబీకులను మాత్రమే కలుపుకొని, తనే ఆచరిస్తున్నాడు. ఈయనకు ఏ రాజకీయ వ్యవస్థతోనూ అనుబంధాలు లేవు. తన నిగూఢ తపస్సు ఫలించిందా, లేదా అన్న చర్చ ఇప్పటికీ లేదు. పండితులలో ఇలాంటి వ్యక్తి మీకెవరికైనా తెలిస్తే చెప్పండి, ఒక సాష్టాంగ వందనం చేసుకొని తరిస్తా!

నేను I-SERVE అనే వైదిక వైజ్ఞానిక పరిశోధనా సంస్థను 2004లో స్థాపించి 12 సంవత్సరాల పాటు దానికి అధ్యక్షుడిగా వున్నాను. ఆ తరుణంలో నా ప్రతి పరిశోధనలోనూ శ్రీ శివరామకృష్ణ శర్మగారు ఒక “రిసోర్స్ పర్సన్”గా నాకు అపారమైన విజ్ఞాన దీధితులను అందించారు. వీరు నిర్వహించిన పరిశోధనలతో నాకు గూడా కొంత స్పర్శ వుంది. వీరి గ్రంథాలన్నీ నేను చదివాను. వాటిలో కొన్నిటికి ముందు మాటలు వ్రాసే భాగ్యం నాకు లభించింది. అందుకే నా దృష్టిలో వీరి పరిశోధనలను 4 వర్గాలుగా విభజించవచ్చునని నా భావన-

  1. వేద ప్రతిపాదితాంశాలపై అపార్థాల నివారణలు పురాణాలపై జరిగిన వక్ర వ్యాఖ్యానాలకు తర్కబద్ధమైన సమాధానాలు

  2. పాశ్చాత్య వాసనా ప్రేరితమైన భారత చరిత్ర వక్రీకరణాలకు ఆధునిక విధానంలోనే ప్రతిసవాళ్ళు

  3. ఈ విషయాలకు సంబంధించిన కొన్ని విలువైన గ్రంథాలకు ప్రామాణికమైన అనువాదాలు.

అనువాదాలను వీరి పరిశోధనలుగా గణించవచ్చునా అని సందేహించ వలసిన పనిలేదు. ఎందుకంటే, ఎక్కడో ఉత్తరభారతదేశంలో ఇటువంటి పరిశోధనలు జరిగాయన్న వాసనే మనకు తగిలి వుండేది కాదు- ఈ అనువాదాలు లేకపోతే! అందుకే, వీరి ముద్రితా ముద్రిత రచనలన్నీ గాలికి కొట్టుకు పోకుండా, భావితరాలకు, భావి పరిశోధకులకు, అందాలనే తపనతో ఈ “వెబ్సైట్”ను రూపొందించటం జరుగుతోంది.

ఆధునిక విధానాలలో వీరి “బయోడేటా, లేక రెస్యూమ్, లేక స్వీయ పరిచయం” కావాలనుకొనే వారు రాబోయే పుటలను పరిశీలించవచ్చు. ఆ పుటలు Dr. శివరామకృష్ణశర్మగారి మాటలు గనుక, తమ గురించి తాము అధికంగా చెప్పుకొనే అలవాటు లేని శర్మగారు వదిలిపెట్టిన ముఖ్యవిషయాలను సంగ్రహంగా క్రోడీకరించటం కోసమే ఈ చిరు వ్యాసాన్ని నేను పాఠకులకు సమర్పించుకొంటున్నాను.

ఈ పరిశోధన ఇక్కడితో ఆగిపోతుందన్న భయం నాకు గానీ, శ్రీశర్మగారికి గానీ లేదు. ఇద్దరికీ—

“ఉత్పత్స్యతే మమ తు కోపి సమానధర్మా

కాలోహ్యయం నిరవధిః; విపులా చ పృథ్వీ”

(నాతో సమానమైన మానసిక ధర్మంగలవాళ్ళు పుట్టి తీరుతారు; ఎప్పుడు – అనే ప్రశ్న లేదు. కాలానికి అంతు లేదు. ఎక్కడ – అనే ప్రశ్నలేదు. భూమి చాలా విశాలమైనది.) అన్న భవభూతి మహాకవి సూక్తి నిత్య ప్రేరకంగా నిగనిగలాడుతూనే వుంది.

ఇక ముందు పుటలలోనికి అడుగులు

సారించమని మీకు స్వాగతం పలుకుతూ…. సెలవ్!

కుప్పా వేంకట కృష్ణమూర్తి.

తేదీ: 12.05.2026, (హనుమజ్జయన్తి)